MI vs CSK: నల్ల రిబ్బన్లతో చెన్నై ఆటగాళ్లు.. ఎందుకంటే? | ముంబై ఇండియన్స్‌తో జరిగిన IPL 2026 క్లాష్‌లో CSK ప్లేయర్స్ ఎందుకు నల్ల బాహు బ్యాండ్‌లు ధరించారు

క్రీడలు

oi-ఉప్పల శివప్రసాద్

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) ఆటగాళ్లు నల్ల రిబ్బన్‌లతో బరిలోకి దిగారు. వాంఖడే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే. ఓపెనర్లు సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, ఆటగాళ్లందరూ చేతులకు నల్ల బ్యాండ్‌లు ధరించి కనిపించారు.

తమ బౌలర్ ముఖేష్ చౌదరి తల్లి ప్రేమ్ దేవి మృతికి సంతాపంగా ఆటగాళ్లందరూ ఈ బ్లాక్ బ్యాండ్‌లు ధరించినట్లు CSK సోషల్ మీడియాలో ప్రకటించింది. ‘ఇది ముఖేష్ తల్లి కోసం. ఆమె జ్ఞాపకార్థం, ముఖేష్‌కు సంఘీభావంగా.. ఈరోజు నల్ల బ్యాండ్‌లు ధరించి ఆడుతున్నాం’’ అని సీఎస్‌కే ట్వీట్ చేసింది.

గత ఏడాది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ముఖేష్ చౌదరి తల్లి గత మంగళవారం (ఏప్రిల్ 21) ముంబైలోని టాటా ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. రాజస్థాన్‌లోని భిల్వారాలో ఆమె అంత్యక్రియలు నిర్వహించగా, ముఖేష్ వాటిని పూర్తి చేసి తాజా మ్యాచ్ ఆడేందుకు బుధవారం రాత్రి జట్టులో చేరాడు.

ముంబై ఇండియన్స్‌తో జరిగిన IPL 2026 క్లాష్‌లో CSK ప్లేయర్స్ ఎందుకు నల్ల బాహు బ్యాండ్‌లు ధరించారు

ఈ కష్టకాలంలో సీఎస్‌కే మేనేజ్‌మెంట్‌తోపాటు మహేంద్రసింగ్ ధోనీ ముఖేష్ చౌదరికి అండగా నిలిచినట్లు తెలుస్తోంది. ముఖేష్‌కు మానసిక ధైర్యాన్ని ఇవ్వడమే కాకుండా, ధోనీ స్వయంగా ఆసుపత్రికి వెళ్లి తల్లిని పరామర్శించినట్లు వార్తలు వచ్చాయి.

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ ముగిసిన తర్వాత ముఖేష్ చౌదరి నేరుగా తన స్వస్థలమైన భిల్వారాకు వెళ్లాడు. ఆ మ్యాచ్ లో చెన్నై ఓడిపోయినా.. ముఖేష్ తన బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ వంటి విధ్వంసక బ్యాట్స్‌మెన్‌లను వరుస బంతుల్లో అవుట్ చేసి తన సత్తా చాటాడు. ఈ సీజన్‌లో అతనికి ఇదే తొలి మ్యాచ్ కావడం గమనార్హం. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ముఖేష్ చౌదరి తన తొలి ఓవర్‌లోనే వికెట్ తీశాడు. ప్రమాదకరమైన క్వింటన్ డి కాక్ (7) పెవిలియన్ బాట పట్టాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 207 పరుగులు చేసింది. సంజూ శాంసన్ (54 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 101 నాటౌట్) ఒక్కడే అజేయ శతకంతో రాణించగా.. మిగతా బ్యాట్స్ మెన్ విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో అశ్వనీ కుమార్ (2/37), అల్లా గజన్‌ఫర్ (2/25) రెండేసి వికెట్లు తీశారు. జస్ప్రీత్ బుమ్రా, మిచెల్ సాంట్నర్ తలో వికెట్ తీశారు.

More posts