ఆంధ్ర ప్రదేశ్
ఓయి-లింగారెడ్డి గజ్జల
తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రస్థానంలో ఓ మైలురాయి ఆవిష్కృతమైంది. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడంతోపాటు కార్యకర్తల కష్టసుఖాల్లో ఆదుకోవడంలో తనదైన శైలిని ప్రదర్శించిన నారా లోకేష్ కు పార్టీ పగ్గాలు అప్పగించారు. టీడీపీ జాతీయ కార్యవర్గంలో కీలక మార్పులు చేస్తూ లోకేష్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా చంద్రబాబు ప్రకటించారు. ఈ నిర్ణయంతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.
పార్టీలో నారా లోకేష్ ప్రయాణం అంచెలంచెలుగా సాగింది. మొట్టమొదట పార్టీ ఐటీ శాఖ బాధ్యతలు చేపట్టి డిజిటల్ యుగంలో టీడీపీని అగ్రగామిగా నిలిపారు. ఆ తర్వాత జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి పార్టీ అంతర్గత వ్యవహారాలపై పట్టు సాధించారు. ముఖ్యంగా ‘క్యార్యకర్తల సంక్షేమ నిధి’ ద్వారా వేలాది మంది కార్మికుల కుటుంబాలను ఆదుకొని భరోసా కల్పించారు. ‘యువగలం’ పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకున్న ఆయన ఇప్పుడు పార్టీని జాతీయ స్థాయిలో నడిపించేందుకు సిద్ధమయ్యారు.

కార్యకర్తల కల సాకారమైన వేళ!
లోకేష్‌కు పార్టీలో ఉన్నత బాధ్యతలు అప్పగించాలని రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు గత కొంత కాలంగా డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు పాలనపై దృష్టి సారిస్తున్న తరుణంలో లోకేష్ పార్టీ సమన్వయ బాధ్యతలు నిర్వహిస్తే క్యాడర్‌కు త్వరగా న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు. ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ బాధ్యతలు చేపట్టడంతో అటు ప్రభుత్వంలోనూ, ఇటు పార్టీలోనూ యువతకు పెద్దపీట వేసినట్లు కనిపిస్తోంది.
జాతీయ స్థాయి రాజకీయాల్లో లోకేష్ పాత్ర
లోకేష్ కు సీఎం చంద్రబాబు నాయుడు ఈ పదవి ఇవ్వడం వెనుక దీర్ఘకాలిక వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం బలంగా ఉన్న తరుణంలో క్షేత్రస్థాయి నుంచి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాల్సి ఉంది. జాతీయ స్థాయిలో ఇతర పార్టీలతో సమన్వయం చేసుకుంటూ పార్టీ సిద్ధాంతాలను యువతలోకి తీసుకెళ్లే బాధ్యతలను లోకేష్ సమర్థవంతంగా నిర్వహించగలరని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
ముఖ్యంగా కార్యకర్తల సంక్షేమంపై లోకేష్ కు ఉన్న పట్టు రానున్న రోజుల్లో టీడీపీని అజేయ శక్తిగా మార్చేందుకు దోహదపడుతుంది. లోకేష్ ప్రమోషన్‌తో టీడీపీలో రెండో తరం నాయకత్వం అధికారికంగా బలపడింది. పాత తరం అనుభవాన్ని, కొత్త తరం దూకుడును మేళవించి పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
