అంతర్జాతీయ
ఓయ్-జక్కీ మహేష్
సముద్రంలో భారీ క్షిపణి పరీక్షలు నిర్వహించి ఉత్తర కొరియా మరోసారి తన సైనిక పటిమను ప్రపంచానికి చాటి చెప్పింది. సాధారణంగా భూమిపై ఉన్న లాంచ్ సైట్ల నుంచి ప్రయోగాలు చేసే ఉత్తర కొరియా ఈసారి కొత్త వ్యూహంతో ముందుకు వచ్చింది. అత్యాధునిక యుద్ధనౌక నుంచి క్రూయిజ్, యాంటీ షిప్ క్షిపణులను ప్రయోగించడం అంతర్జాతీయంగా సంచలనంగా మారింది. అమెరికా, ఇరాన్, ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన తరుణంలో ఉత్తర కొరియా తన నౌకాదళ బలాన్ని ప్రదర్శించడం వెనుక లోతైన వ్యూహాత్మక కారణాలు ఉన్నాయని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
గంటల తరబడి నింగిలో క్షిపణి విన్యాసాలు
ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా వెల్లడించిన సమాచారం ప్రకారం, ఈ పరీక్షలు గత ఆదివారం నిర్వహించబడ్డాయి మరియు దాని రికార్డులు మంగళవారం వెల్లడయ్యాయి. ఈ విన్యాసాలలో రెండు వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణులు మరియు ఒక యాంటీ షిప్ క్షిపణిని ప్రయోగించారు. ఇందులో క్రూయిజ్ క్షిపణులు ఏకంగా 2 గంటలకు పైగా గగనతలంలో ప్రయాణించి అందరినీ విస్మయానికి గురిచేశాయి. అదేవిధంగా యాంటీ షిప్ క్షిపణి దాదాపు 33 నిమిషాల పాటు ప్రయాణించి అత్యంత కచ్చితత్వంతో సముద్రంలో లక్ష్యాన్ని చేధించింది. 5,000 టన్నుల విధ్వంసక నౌక ‘చోయ్ హైయాన్’ నుంచి ఈ క్షిపణులను ప్రయోగించారు.

కిమ్ జాంగ్ ఉన్ పర్యవేక్షణలో క్షిపణి ప్రయోగం
ఈ క్షిపణి పరీక్షల ప్రక్రియ మొత్తాన్ని ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ స్వయంగా పర్యవేక్షించారు. ప్రయోగం విజయవంతం అయినందుకు అధికారులను అభినందించారు. క్షిపణుల పనితీరును సమీక్షించడమే కాకుండా నౌకాదళంలోకి వచ్చే కొత్త యుద్ధనౌకల తయారీ, వాటిలో అమర్చాల్సిన ఆయుధ వ్యవస్థల గురించి సుదీర్ఘంగా చర్చించారు. దేశ నౌకాదళం, అణు సామర్థ్యాలు వేగంగా అభివృద్ధి చెందడం పట్ల కిమ్ సంతృప్తి వ్యక్తం చేశారు. దేశ రక్షణలో అణుశక్తిని అజేయమైన స్థాయికి తీసుకెళ్లడమే తమ అంతిమ లక్ష్యమని కిమ్ జాంగ్ ఉన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
అమెరికాకు గట్టి హెచ్చరిక
ప్రస్తుతం పరీక్షిస్తున్న ‘చోయ్ హ్యోన్’ యుద్ధనౌకతో పాటు మరో రెండు అధునాతన యుద్ధనౌకలను ఉత్తర కొరియా వేగంగా నిర్మిస్తోంది. బాలిస్టిక్ క్షిపణులపైనే కాకుండా సముద్రం నుంచి కూడా ఏకకాలంలో దాడులు చేసే సామర్థ్యాన్ని పెంచుకుంటూ ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తోంది. ఈ పరిణామాలు అమెరికాకు, దాని మిత్రదేశాలకు ప్రత్యక్ష హెచ్చరికగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఎలాంటి సంక్షోభం ఎదురైనా తమ స్పందన అత్యంత భయంకరంగా, ఊహించని విధంగా ఉంటుందని ఈ తాజా పరీక్షల ద్వారా ఉత్తర కొరియా మరోసారి స్పష్టం చేసింది.
