క్రీడలు
-జక్కీ మహేష్
IPL 2026 సీజన్‌లో రాయ్‌పూర్‌లో జరిగిన ఉత్కంఠభరితమైన ఎన్‌కౌంటర్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ముంబై ఇండియన్స్ (MI)ని రెండు వికెట్ల తేడాతో ఓడించింది. చివరి బంతి వరకు సాగిన ఈ మ్యాచ్‌లో ఓడిన ముంబై ఇండియన్స్ అధికారికంగా ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భువనేశ్వర్ కుమార్ ధాటికి ఓపెనర్ రికెల్టన్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఔటయ్యారు. రోహిత్ శర్మ 22 పరుగుల వద్ద నిష్క్రమించగా, యువ బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మ (57), నమన్ ధీర్ (47) సహకరించారు. వారి బాధ్యతాయుత ఆటతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 166 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 4 వికెట్లు తీశాడు.
167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి తడబడిన ఆరంభం లభించింది. స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ డకౌట్ కాగా, జాకబ్ బెతెల్ (27), పడిక్కల్ (12) కూడా తొందరగానే ఔటయ్యారు. ఈ దశలో కృనాల్ పాండ్యా 46 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో అద్భుతంగా 73 పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. మ్యాచ్ చివరి ఓవర్‌కు చేరుకునే సరికి RCB విజయానికి 15 పరుగులు చేయాల్సి ఉంది. చివరి మూడు బంతుల్లో టెన్షన్ ఎక్కువగా ఉన్న సమయంలో భువనేశ్వర్ కుమార్ భారీ సిక్సర్ కొట్టాడు. ఆ తర్వాత చివరి బంతికి మరో రెండు పరుగులు రావడంతో బెంగళూరు 2 వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది.

బౌలింగ్‌లో 4 కీలక వికెట్లు తీసి బ్యాటింగ్‌లో చివరి బంతికి మ్యాచ్‌ను ముగించిన భువనేశ్వర్ కుమార్ RCB విజయానికి నిజమైన హీరో. ఈ ఓటమితో వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్ ఆశలు కోల్పోయింది. మరోవైపు ఈ విజయంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని పటిష్టం చేసుకుంది.
