ఆరోగ్యం
-సాయి చైతన్య
మధుమేహంతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల వయసుతో నిమిత్తం లేకుండా మధుమేహ బాధితులు పెరుగుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి చాలా మంది ఇంటి చిట్కాలను పాటిస్తారు. జీలకర్ర, మెంతులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నీటిలో నానబెట్టిన వీటిని తాగడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి మెరుగుపడుతుంది మరియు జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. అయితే బ్లడ్ షుగర్ త్వరగా తగ్గాలంటే మెంతి నీరు మంచిదా లేక జీలకర్ర మంచిదా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. దీనిపై నిపుణులు క్లారిటీ ఇస్తున్నారు.
రక్తంలో చక్కెర నియంత్రణలో జీరా నీరు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. జీలకర్ర నీరు జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడంలో సహాయపడుతుంది. జీలకర్రలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో మంటను తగ్గించి కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇది బరువు తగ్గడానికి, అలాగే చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. బరువు తగ్గడం ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తుంది, తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను పరోక్షంగా నియంత్రణలో ఉంచుతుంది. ఉదయాన్నే గోరువెచ్చని జీలకర్ర నీటిని తాగడం వల్ల రోజంతా మిమ్మల్ని శక్తివంతంగా ఉంచుకోవచ్చు. జీలకర్రలోని యాంటీ-డయాబెటిక్ లక్షణాలు టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ మరియు హెచ్‌బిఎ1సి స్థాయిలను గణనీయంగా తగ్గించాయి. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది మరియు శరీరం గ్లూకోజ్‌ను సమర్ధవంతంగా ఉపయోగించుకునేలా చేస్తుంది. అదేవిధంగా, జీరా నీరు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

రెండింటితో ప్రయోజనాలు.. నిపుణుల సూచనలు
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, మెంతులు రక్తంలో చక్కెర స్థాయిలను మరియు ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడంలో సహాయపడటం వలన మధుమేహ వ్యాధిగ్రస్తులకు నిజంగా ఒక వరం. ఒక చెంచా మెంతి గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయాన్నే ఆ నీటిని తాగి, మెంతి గింజలను నమలడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. ఇది టైప్-2 మధుమేహం ఉన్నవారికి ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. ఇది గట్ (జీర్ణ నాళం) లో జెల్ లాంటి పదార్థాన్ని ఏర్పరుస్తుంది మరియు గ్లూకోజ్ శోషణను తగ్గిస్తుంది. ఇది ట్రైగ్లిజరైడ్స్, ఎల్డిఎల్, మొత్తం కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఖాళీ కడుపుతో తీసుకుంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్‌ని మెరుగుపరచడంలో ఇది మరింత ఉపయోగకరంగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను త్వరగా తగ్గించాలనుకునే వారికి మెంతి నీరు ఉత్తమం. జీర్ణ సమస్యలు ఉన్నవారు లేదా బరువు తగ్గాలనుకునే వారు జీలకర్ర నీటిని ఎంచుకోవచ్చు. మీ శరీరాకృతిని బట్టి, వైద్యుల సలహా మేరకు రెండింటినీ తీసుకోవచ్చు. జీవనశైలిలో మార్పులు.. ఆరోగ్యకరమైన ఆహారంతో వైద్యుల సూచనలు పాటిస్తే షుగర్ అదుపులో ఉంటుంది.
