భారతదేశం
ఓయ్-బొమ్మ శివకుమార్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అమెరికాతో యుద్ధం కారణంగా ప్రపంచ వాణిజ్యానికి గుండెకాయ అయిన హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన సంగతి తెలిసిందే. దాంతో ప్రపంచ దేశాలు చమురు, గ్యాస్ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. దాదాపు అన్ని దేశాలు పేద, మధ్య తరగతి, అభివృద్ధి చెందుతున్న లేదా అభివృద్ధి చెందిన దేశాలు అనే తేడా లేకుండా పోరాడుతున్నాయి. హార్ముజ్ జలసంధి మూసివేత ప్రభావం భారత్‌పైనా పడింది. మన దేశంలోని చాలా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. గ్యాస్ సిలిండర్ బుకింగ్స్‌లోనూ పలు మార్పులు చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల మధ్య ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలను బట్టి చూస్తే.. రానున్న రోజుల్లో దేశంలో లాక్‌డౌన్ లాంటి పరిస్థితులు రావచ్చని ఆయన సూచనప్రాయంగా స్పష్టం చేశారు.
పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించాలని ఇటీవల ప్రధాని మోదీ అన్నారు. వీలైనంత వరకు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలని సూచించారు. ఏడాది పాటు విదేశీ ప్రయాణాలు మానుకుంటే మంచిదన్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగానే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగాయని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఈ భారాన్ని రెండు నెలలపాటు కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. ఈ మేరకు ప్రజలు మెట్రో తరహా ప్రయాణాలకే మొగ్గు చూపాలని సూచించారు. అలాగే వంటనూనెల వాడకాన్ని వీలైనంత తగ్గించాలని, అనవసర ఖర్చులను తగ్గించుకోవాలని ప్రధాని మోదీ భావిస్తున్నారు. ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్‌లైన్ సమావేశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ప్రస్తుతం ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. గత నెలలో పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఇరాన్, అమెరికా మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. ఇరుదేశాల మధ్య శాంతి చర్చలకు పాకిస్థాన్ మరోసారి ఆహ్వానించగా, ఇరాన్ అంగీకరించలేదు. దాంతో హార్ముజ్ జలసంధిని ట్రంప్ దిగ్బంధించారు. ఈ మేరకు ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు దేశాల మధ్య ఎప్పుడు సాధారణ పరిస్థితులు నెలకొంటాయో తెలియదు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. భవిష్యత్తులో లాక్‌డౌన్ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
