తెలంగాణ
ఓయి-లింగారెడ్డి గజ్జల
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుడు (2023) కూడా మహిళా రిజర్వేషన్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూనే దాని ముసుగులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసిన ‘డీలిమిటేషన్’ ప్రక్రియపై తీవ్రంగా ధ్వజమెత్తారు. మహిళా సాధికారతకు తాము ఎప్పుడూ ప్రాధాన్యం ఇస్తున్నామని, 2011లో అసెంబ్లీలో దీనిపై తీర్మానం చేశామని.. డీలిమిటేషన్ విషయంలో కేంద్రం అనుసరించాల్సిన వ్యూహంపై ఘాటుగా హెచ్చరికలు జారీ చేశారని గుర్తు చేశారు.
జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అభివృద్ధి చెందుతున్న దక్షిణాది రాష్ట్రాలకు శాపంగా మారుతుందని కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. అంతకుముందు కేటీఆర్, హరీశ్ రావులతో జరిగిన కీలక భేటీలో ఆయన ఈ విషయంపై పూర్తి క్లారిటీ ఇచ్చారు. దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న రాష్ట్రాల గొంతు నొక్కే విధంగా సీట్ల కేటాయింపును సహించేది లేదని స్పష్టం చేశారు.

గణాంకాలతో విన్నింగ్ కాల్!
ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలకు లోక్‌సభలో 24 శాతం ప్రాతినిధ్యం ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం సీట్లు పెంచితే ఈ వాటా తగ్గి ఉత్తరాది రాష్ట్రాల ఆధిపత్యం పెరుగుతుందని కేసీఆర్ లెక్కలతో వివరించారు. దక్షిణాదిలో సీట్ల శాతం తగ్గించకుండా ఇప్పుడున్న సీట్లను కనీసం 50 శాతం పెంచాలని డిమాండ్ చేశారు. బిల్లులోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే బీఆర్ఎస్ తన నిర్ణయాన్ని ప్రకటిస్తుందని, అప్పటి వరకు తొందరపడి ఎలాంటి మద్దతు ఇవ్వవద్దని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు.
ఢిల్లీకి వినిపించే స్వరం!
‘మనమంతా గర్వించదగ్గ భారతీయులం.. దేశంలోనే అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాలకు మేం ప్రతినిధులం.. చట్టసభల్లో మన ప్రజల గొంతుకలు నొక్కుతుంటే చూస్తూ ఊరుకోం’ అని కేసీఆర్ అప్పట్లో అన్నారు. దక్షిణాదికి అన్యాయం జరిగితే రాజకీయ పోరాటంగా మిగిలిపోదని, పెద్దఎత్తున ప్రజాఉద్యమం అవుతుందని హెచ్చరించారు. ఢిల్లీ పాలకులు తెలివిగా ఆలోచిస్తారని ఆశిస్తున్నా’ అంటూ ఆయన చేసిన ట్వీట్ అప్పట్లో జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది.
మొత్తానికి మహిళా రిజర్వేషన్ అమలును స్వాగతిస్తూనే.. దానికి సంబంధించిన డీలిమిటేషన్ ప్రక్రియ దక్షిణాది రాష్ట్రాల రాజకీయ అస్తిత్వాన్ని దెబ్బతీయకూడదనేది కేసీఆర్ ప్రధాన ఉద్దేశం.
