క్రీడలు
oi-ఉప్పల శివప్రసాద్
ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. శనివారం ముల్లన్‌పూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విజయం సాధించింది. పేలవమైన బౌలింగ్‌తో పాటు హెన్రిచ్ క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయావకాశాలను దెబ్బతీసింది. 220 పరుగుల భారీ లక్ష్యాన్ని సన్ రైజర్స్ హైదరాబాద్ కాపాడుకోలేకపోయింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 219 పరుగుల భారీ స్కోరు చేసింది. అభిషేక్ శర్మ (28 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లతో 74) విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగాడు. ట్రావిస్ హెడ్ (23 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్లతో 38) దూకుడుగా ఆడాడు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, శశాంక్ సింగ్ 20 వికెట్లు తీయగా, జేవియర్ బార్ట్‌లెట్‌కి ఒక వికెట్ లభించింది.

అనంతరం పంజాబ్ కింగ్స్ 18.5 ఓవర్లలో 4 వికెట్లకు 223 పరుగులు చేసి విజయం సాధించింది. ఓపెనర్లు ప్రియాంష్ ఆర్య (20 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 57), ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 51), శ్రేయాస్ అయ్యర్ (33 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 69 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో శివంగ్ కుమార్ (3/33) ఒక్కడే మూడు వికెట్లు పడగొట్టాడు. హర్ష్ దూబే ఒక వికెట్ తీశాడు.
క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ చేస్తున్నాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్‌లో హెన్రిచ్ క్లాసెన్ తన జిడ్డు బ్యాటింగ్‌తో జట్టును దెబ్బతీశాడు. అతను 33 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్‌తో 39 పరుగులు చేశాడు. 250కిపైగా పరుగులు చేస్తుందని భావించిన సన్ రైజర్స్ హైదరాబాద్ 219 పరుగులకే పరిమితమైంది. అతని జిడ్డు బ్యాటింగ్ కారణంగా స్లాగ్ ఓవర్లలో సన్ రైజర్స్ 37 పరుగులు చేసింది. క్లాసెన్ కాస్త దూకుడుగా ఆడితే జట్టు లక్ష్యానికి 20-30 పరుగులు అదనంగా చేరి ఉండేవి. అప్పుడు సన్‌రైజర్స్‌కు గెలిచే అవకాశం వచ్చింది.
చెత్త బౌలింగ్..
క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్‌తో పాటు బౌలర్ల వైఫల్యం సన్‌రైజర్స్ పతనానికి కారణమైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో శివంగ్ కుమార్, హర్షదుబే మినహా మిగతా బౌలర్లు ఘోరంగా విఫలమయ్యారు. ముఖ్యంగా హర్షల్ పటేల్(0/39), జయదేవ్ ఉనద్కత్(0/40), ఎషాన్ మలింగ(0/46)ల వైఫల్యం సన్ రైజర్స్ హైదరాబాద్ విజయావకాశాలను దెబ్బతీసింది.
ప్రఫుల్ హింగే అరంగేట్రం చేస్తున్నాడని చెప్పిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. అతని స్థానంలో జయదేవ్ ఉనద్కత్‌గా ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడింది. అయితే ఈ వ్యూహం బెడిసికొట్టింది. ఉనద్కత్ ఎలాంటి ప్రభావం చూపలేకపోయాడు. ప్రఫుల్ హింగే ఆడితే పరిస్థితి మరోలా ఉండేది. హర్షల్ పటేల్ మాత్రం ఉదారంగా పరుగులు ఇచ్చాడు. దాంతో పంజాబ్ కింగ్స్ ముందు 220 పరుగుల భారీ లక్ష్యం చిన్నబోయింది. ఈ బలహీన బౌలింగ్ తో ఈ టోర్నీలో సన్ రైజర్స్ రాణించడం కష్టమే.
