క్రీడలు
oi-ఉప్పల శివప్రసాద్
ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తన జోరును కొనసాగిస్తోంది. ఆ జట్టు వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. అహ్మదాబాద్ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 6 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్‌పై విజయం సాధించింది. జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్ పాండే, రవి బిష్ణోయ్ అద్భుత బౌలింగ్ తో చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది.
211 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 204 పరుగులకే పరిమితమైంది. సాయి సుదర్శన్ (44 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 73) అర్ధ సెంచరీతో అద్భుతంగా రాణించినా ఫలితం లేకుండా పోయింది. మిగిలిన బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో రవి బిష్ణోయ్ (4/41) నాలుగు వికెట్లు పడగొట్టి గుజరాత్ టైటాన్స్‌ను శాసించాడు. నాంద్రే బర్గర్, ర్యాన్ పరాగ్ చెరో వికెట్ తీశారు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 210 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (36 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 55), ధ్రువ్ జురెల్ (42 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 75) అర్ధ సెంచరీలతో రాణించారు. వైభవ్ సూర్యవంశీ (18 బంతుల్లో 5 ఫోర్లు, 31) దూకుడుగా ఆడాడు. గుజరాత్ బౌలర్లలో కగిసో రబడ (2/42) రెండు వికెట్లు తీశాడు. మహ్మద్ సిరాజ్, అశోక్ శర్మ, ప్రసిద్ధ్ కృష్ణ, రషీద్ ఖాన్ తలో వికెట్ తీశారు.
జోఫ్రా ఆర్చర్ వెనుదిరిగాడు..
161 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన గుజరాత్ టైటాన్స్ కు రషీద్ ఖాన్ (24), కగిసో రబాడ (23 నాటౌట్) ఆశలు కల్పించారు. వీరిద్దరూ 8వ వికెట్‌కు 43 పరుగులు జోడించారు. ఓ దశలో గుజరాత్ టైటాన్స్ విజయం లాంఛనమే అనిపించింది. కానీ 19వ ఓవర్లో జోఫ్రా ఆర్చర్ కట్టుదిట్టమైన బౌలింగ్ చేసి 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈ ఓవర్ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ వైపు మళ్లింది.
చివరి ఓవర్లో గుజరాత్ టైటాన్స్ విజయానికి 11 పరుగులు చేయాల్సి ఉంది. ఓవర్‌ను వైడ్‌తో ప్రారంభించిన తుషార్ దేశ్‌పాండే తదుపరి 6 బంతుల్లో కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చి రషీద్ ఖాన్‌ను ఔట్ చేశాడు. దాంతో రాజస్థాన్ రాయల్స్ విజయం లాంఛనమైంది. రబాడను కచ్చితమైన యార్కర్లతో రషీద్ ఖాన్ బౌలింగ్ చేశాడు.
