ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-సాయి చైతన్య
తిరుమల: తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. వారాంతపు సెలవులు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు వస్తుంటారు. పెరుగుతున్న రద్దీని అధిగమించేందుకు టీటీడీ చర్యలు తీసుకుంటోంది. అదే సమయంలో, జూలై నెల దర్శన కోటా విడుదల వివరాలను టిటిడి ప్రకటించింది. వివిధ రకాల దర్శనాలు.. ఆన్‌లైన్‌లో గది కోటా పొందే తేదీలను ప్రకటించారు. టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
జూలై నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల (సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) కోటాను ఏప్రిల్ 18 ఉదయం 10 గంటలకు టిటిడి విడుదల చేయనుంది. ఈ సేవా టిక్కెట్లను ఎలక్ట్రానిక్ డిప్ కోసం 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టిక్కెట్లు పొందిన వారికి 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నాం 12 గంటల లోపు డబ్బులు చెల్లించిన వారికి టిక్కెట్లు మంజూరు చేస్తారు. 21వ తేదీ ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టిక్కెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. అదేవిధంగా.. వర్చువల్ సేవల కోటా, వాటి వీక్షణ స్లాట్‌లను 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

దర్శనాలు… వసతి కావాలంటే
కాగా, 23న ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటా విడుదల కానుంది. ఇక.. శ్రీవాణి ట్రస్టు దర్శనం టిక్కెట్ల కోటాను 23వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. వృద్ధులు, వికలాంగులు, దీర్ఘకాలికంగా అనారోగ్యంతో ఉన్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను టీటీడీ విడుదల చేయనుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేయనుంది. తిరుమల, తిరుపతిలోని రూం కోటాను 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టిక్కెట్లను బుక్ చేసుకోవాలని కోరారు.
