భారతదేశం
ఓయ్-చంద్రశేఖర్ రావు
తమిళనాడు రాజకీయాల్లో కొత్త శకం మొదలైంది. తమిళనాడు ముఖ్యమంత్రిగా తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. సి జోసెఫ్ విజయ్ పేరుతో ప్రమాణం చేశారు. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఆయనతో ప్రమాణం చేయించారు. తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన టీవీకే అనూహ్య విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం విశేషం. హంగ్ అసెంబ్లీ ఏర్పడిన నేపథ్యంలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకే, ఏఐయూఎంఎల్ వంటి పార్టీల సహకారంతో ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటైంది.
అస్సాంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా హిమంత బిస్వా శర్మ వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నెల 12న గౌహతిలో ప్రమాణ స్వీకారం జరగనుంది. దీనికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర బీజేపీ/ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు.

కొద్దిసేపటి క్రితం, బిజెపి శాసనసభా పక్షం హిమంత బిస్వా శర్మను నాయకుడిగా ఎన్నుకుంది. బీజేఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఆయన వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. మే 4న అసోంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయఢంకా మోగించగా.. మొత్తం 126 స్థానాల్లో 82 స్థానాల్లో విజయం సాధించి భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
అస్సాంలో బీజేపీ వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. తొలి దశలో ఏర్పాటైన బీజేపీ ప్రభుత్వానికి శర్వానంద సోనోవాల్ నేత. ఆ తర్వాత హిమంత బిస్వా శర్మ రెండు పర్యాయాలు ఎన్నికయ్యారు. ఈ విజయంతో ఈశాన్య రాష్ట్రాల్లో భాజపా పట్టు బలపడినట్లయింది. గత ప్రభుత్వంలో ఆరోగ్యం, విద్య వంటి కీలక శాఖలను సమర్థంగా నిర్వహించిన హిమంత.. ఇప్పుడు రాష్ట్రాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే బాధ్యతను తీసుకోనున్నారు.
