వినోదం
ఓయ్-గరికపాటి రాజేష్
రాజకీయాల్లో వ్యూహాలు ఎంత ముఖ్యమో, కొన్నిసార్లు ‘సెంటిమెంట్లు’ కూడా అంతే ప్రభావం చూపుతాయి. ప్రస్తుతం తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత మాజీ మంత్రి రోజా పరిస్థితి అలాగే ఉంది. గత ఏపీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైన తర్వాత ఆమె పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో తన రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావించారు. అయితే అక్కడ ఆమె ప్రచారం చేసిన డీఎంకే పార్టీ కూడా ఊహించని రీతిలో కుప్పకూలడంతో సోషల్ మీడియాలో ఆమెకు వ్యతిరేకంగా మీమ్స్ హల్చల్ చేస్తున్నాయి.
డీఎంకే పతనం
ఒకప్పుడు తమిళ రాజకీయాలను శాసించిన డీఎంకే.. ఈ ఎన్నికల్లో కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయి మూడో స్థానానికి పడిపోయి రాజకీయ వర్గాలను షాక్ కు గురి చేసింది. దళపతి విజయ్ సృష్టించిన విజృంభణ ఒకవైపు ఉంటే.. స్టార్ క్యాంపెయినర్ గా రోజా ఎంట్రీ డీఎంకేకు మరో శాపంగా మారిందని విశ్లేషకులు అంటున్నారు. ఆమె పర్యటించి, మహిళల కోసం డీఎంకే పథకాలను ప్రశంసించిన నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు భారీ తేడాతో ఓడిపోవడం ఈ విమర్శలకు బలం చేకూర్చింది. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే రోజా తమిళనాడులో డీఎంకే తరపున ప్రచారానికి వెళ్లినట్లు సమాచారం.

పక్క రాష్ట్రంలో డీఎంకేతో స్నేహ సంబంధాలను బలోపేతం చేసుకోవాలని వైసీపీ భావించినా.. ఫలితం మాత్రం అందుకు భిన్నంగా వచ్చింది. ఏపీలో ఓటమి తర్వాత తమిళనాడులో తన క్రేజ్ ఏంటో చూపించి గుర్తింపు తెచ్చుకోవాలని భావించిన రోజాకు ఈ ఫలితాలు కోలుకోలేని దెబ్బ తీశాయి. ఇది రోజా వ్యక్తిగత ఓటమి మాత్రమే కాకుండా వైసీపీ వ్యూహకర్తల విఫల ప్రయత్నం అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
సోషల్ మీడియాలో ట్రోల్స్
ఫలితాలు వెలువడిన నిమిషం నుంచి నెటిజన్లు రోజాను టార్గెట్ చేస్తూ మీమ్స్ వర్షం కురిపిస్తున్నారు. ‘ఆంధ్రా ఖాళీ అయింది.. ఇప్పుడు తమిళనాడులో డీఎంకే కూడా క్లీన్‌స్వీప్ అయింది’ అంటూ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఎన్నికల ముందు ఆమెను ప్రచారానికి ఆహ్వానించినప్పుడు చేసిన హెచ్చరికలను గుర్తు చేసుకుంటూ.. ‘డమ్మీగా వచ్చిన రోజా.. డీఎంకేను డమ్మీ చేసింది’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. గతంలో ఆమె ఏ పార్టీ తరపున ప్రచారం చేసినా ప్రత్యర్థికి లాభం చేకూర్చిందన్న పాత రికార్డులను కూడా నెటిజన్లు బయటికి తెస్తున్నారు.
ఈ వరుస పరాజయాల నేపథ్యంలో భవిష్యత్తులో రోజాను ప్రచారానికి పిలిచే సాహసం ఏ పార్టీ చేస్తుందా? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈమె సినిమా గ్లామర్ ఓట్లను తెచ్చిపెడుతుందని భావించిన పార్టీలకు ఇప్పుడు ఈ ‘నెగిటివ్ సెంటిమెంట్’ బుర్ర బద్దలుకొడుతోంది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమెను ప్రచారానికి పంపాలా వద్దా అనే సందిగ్ధంలో ఆమె సొంత పార్టీ వైసీపీలో కూడా అధిష్టానం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి తమిళనాట ఈ వైఫల్యం రోజా రాజకీయ ప్రస్థానంలో చెరగని ముద్రగా మిగిలిపోయింది.
