భారతదేశం
ఓయ్-చంద్రశేఖర్ రావు
నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు గడువు సమీపిస్తోంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో ఈ నెల 4న కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా వెల్లడి కావడంతో అందరి దృష్టి వీటిపైనే ఉంది. ఎగ్జిట్ పోల్స్ నేపథ్యంలో అన్ని పార్టీలు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నాయి.
ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో తమిళనాడులో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ పరిణామంతో రాజకీయ పార్టీలు రిసార్ట్ రాజకీయాలకు సిద్ధమవుతున్నాయి. విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ గెలిచే అభ్యర్థులందరినీ ఏకతాటిపైకి తీసుకువస్తుంది. ఇందుకోసం మహాబలిపురం సమీపంలోని పూంజేరిలో రిసార్ట్‌ను బుక్ చేసుకుంది. గెలుపొందిన అభ్యర్థులందరూ కూడా అక్కడికి వెళ్లాల్సిందే.

మే 4న గెలిచిన తమ పార్టీ అభ్యర్థులు ఆలస్యం చేయకుండా పనయ్యూరులోని పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకోవాలని విజయ్ ముందుగా సూచించారు. గెలిచే అభ్యర్థుల సంఖ్య అంచనాలకు మించి రావచ్చన్న ఉద్దేశంతో వారందరినీ మహాబలిపురం పూంజేరి రిసార్ట్‌కు తరలించాలని పార్టీ నిర్ణయించింది. ఇందుకోసం పూంజేరిలో రిసార్ట్‌ను బుక్ చేసుకోవడంతో పాటు అభ్యర్థులను తరలించేందుకు మూడు బస్సులను కూడా అందుబాటులో ఉంచనున్నారు.
ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని విజయ్ ఇప్పటికే తన పార్టీ లీగల్ విభాగానికి ఆదేశాలు జారీ చేశారు. గుర్రపు వ్యాపారానికి పాల్పడుతున్న పార్టీలపై న్యాయ పోరాటం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్లు టీవీకే వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల కౌంటింగ్ రోజు శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా భద్రతను పటిష్టం చేయాలని ఎన్నికల కమిషన్‌ను కోరింది. పార్టీ ప్రధాన కార్యదర్శి అధవ్ అర్జున శనివారం ప్రధాన ఎన్నికల అధికారిని కలిశారు. వినతిపత్రం సమర్పించారు.
మరోవైపు అధికార డీఎంకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తోంది. కౌంటింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. ఈ ఎన్నికల్లో డీఎంకే విజయం సాధిస్తుందని పార్టీ అధికార ప్రతినిధి ధరణీధరన్ అన్నారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ గెలుపు ఖాయమని, ప్రతిపక్షం ఎవరనేది వేచి చూడాల్సిందేనని వ్యాఖ్యానించారు. తమ పార్టీకి 40 నుంచి 45 శాతం ఓట్లు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
