భారతదేశం
ఓయి-లింగారెడ్డి గజ్జల
పశ్చిమ బెంగాల్ ఎన్నికల పోరు తారాస్థాయికి చేరుకుంది. బుధవారం రాత్రి వెలువడిన మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు బెంగాల్ గడ్డపై రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దశాబ్ద కాలంగా సాగుతున్న మమతా బెనర్జీ పాలనకు బ్రేక్ పడే అవకాశం ఉందని, బెంగాల్ కోటపై కాషాయ జెండా రెపరెపలాడుతుందని ఈ సర్వే అంచనా వేస్తోంది.
మ్యాట్రిస్ ఎగ్జిట్ పోల్ అంచనాల ప్రకారం, పశ్చిమ బెంగాల్‌లో 294 అసెంబ్లీ స్థానాల పోరులో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 148 సీట్ల మ్యాజిక్ ఫిగర్ బీజేపీకి దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ సర్వే ప్రకారం బీజేపీకి 146 నుంచి 161 సీట్లు వచ్చే అవకాశం ఉంది. గత ఎన్నికలతో పోలిస్తే ఇది బీజేపీకి భారీ విజయంగా చెప్పుకోవచ్చు.

వెనుకబడిన తృణమూల్ కాంగ్రెస్..
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని TMC+ కూటమి ఈసారి గట్టి పోటీని ఇచ్చింది, అయితే అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం కష్టపడుతున్నట్లు కనిపిస్తోంది. మ్యాట్రిజ్ అంచనాల ప్రకారం టీఎంసీ కూటమి 125 నుంచి 140 సీట్లకే పరిమితం కానుంది. ఓట్ల శాతం పరంగా కూడా బీజేపీ 42.5% ఓట్లతో అగ్రస్థానంలో ఉండగా, TMC 40.8% ఓట్లతో కాస్త వెనుకబడి ఉంది. అంటే కేవలం 1.7% ఓట్ల తేడా బెంగాల్ భవిష్యత్తును మార్చబోతోంది.
‘ఇతరులు’ నిర్ణయాత్మక శక్తిగా..
ప్రధాన పార్టీల మధ్య పోరు హోరాహోరీగా సాగుతున్న తరుణంలో ఇతర పార్టీలు, స్వతంత్రులు గెలుచుకునే 6 నుంచి 10 స్థానాలు అత్యంత కీలకం కానున్నాయి. ఇతర అభ్యర్థులకు మొత్తం ఓట్లలో 16.7% వాటా వచ్చే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. బీజేపీ 146 వద్ద ఆగిపోతే బెంగాల్ రాజకీయాల్లో ఈ ‘ఇతరులు’ కింగ్‌మేకర్‌లుగా మారే అవకాశం ఉంది.
ఫలితాల కవర్ (మ్యాట్రిక్స్ అంచనా):
- మొత్తం స్థానాలు: 294 | మెజారిటీ మార్క్: 148
- బీజేపీ: 146 – 161 సీట్లు (42.5% ఓట్లు)
- TMC+: 125 – 140 సీట్లు (40.8% ఓట్లు)
- ఇతరులు: 06 – 10 సీట్లు (16.7% ఓట్లు)
