అంతర్జాతీయ
ఓయ్-బొమ్మ శివకుమార్
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఏమాత్రం తగ్గడం లేదు. యుద్ధం కారణంగా ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసివేయడంతో ప్రపంచ దేశాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ప్రయోజనాలకు రష్యా మద్దతు ఇస్తుందని చెప్పారు. పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పేందుకు వీలైనంత వరకు సహకారం అందిస్తామని చెప్పారు. ఈ మేరకు రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ లో జరిగిన సమావేశంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘీతో సమావేశమయ్యారు.
పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పేందుకు రష్యా తన శాయశక్తులా కృషి చేస్తుందని పుతిన్ పేర్కొన్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా సయ్యద్ మొజ్తాబా ఖమేనీ నుంచి తనకు సందేశం అందిందని పుతిన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇరాన్ ప్రజలు త్వరలో శాంతి రోజులు చూస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి ఇటీవల రష్యా చేరుకున్నారు. అంతకు ముందు పాకిస్థాన్, ఒమన్లలో పర్యటించిన సంగతి తెలిసిందే. ప్రాంతీయ భద్రతతో పాటు ప్రస్తుత యుద్ధ పరిస్థితులపై రష్యాతో ఏకాభిప్రాయం సాధించడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని తెలుస్తోంది.

రష్యా పర్యటన నేపథ్యంలో ఆరాగ్చి కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యాతో ఇరాన్ ఎప్పుడూ సన్నిహిత సంబంధాలు కలిగి ఉందని ఆయన అన్నారు. ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి చర్చలు జరగాల్సిన అవసరం ఉందని ఆరగ్చి స్పష్టం చేశారు. ప్రస్తుతం సెయింట్ పీటర్స్ బర్గ్ నగరంలో పుతిన్ తో ఆరాగ్చి సమావేశమయ్యారు. ఆ తర్వాత రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో భేటీ అవుతారు. మరోవైపు ఇరాన్, అమెరికాల మధ్య చర్చల సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. మూడు రోజుల్లో ఒప్పందం కుదుర్చుకోవాలని, లేకుంటే చమురు పైపులైన్లను పేల్చివేస్తామని ఇరాన్ను హెచ్చరించారు. ఈ మేరకు యుద్ధం ముగియడానికి కాల్పుల విరమణకు మరో 3 రోజులు మాత్రమే మిగిలి ఉందని ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
