వినోదం
ఓయ్-జక్కీ మహేష్
సంగీత దర్శకుడిగా, నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రఘు కుంచె హీరోగా నటించిన చిత్రం ‘గేదెల రాజు’. చైతన్య మోటూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆసక్తికరమైన క్యాప్షన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మర్డర్ మిస్టరీ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో చూడాలి.
కథ
గేదెల రాజు (రఘు కుంచె) కాకినాడలో పేరుమోసిన రౌడీ షీటర్. కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలనే కోరిక బలంగా ఉంది. రాజుకు స్థానిక ఎమ్మెల్యే మద్దతు కూడా లభించింది. అయితే అదే పార్టీకి చెందిన దుర్గ (శ్రీకాంత్ అయ్యంగార్) కూడా టిక్కెట్‌ను కోరుకుంటారు. ఈ రెండింటి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఈ క్రమంలో ఓ రాత్రి గేదెల రాజు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకుంటారు. అనుమానితులుగా ఉన్న దుర్గను, రాజు సోదరుడు శ్యాంబాబును విచారించినా ఫలితం లేకపోయింది. మరి ఈ హత్య వెనుక అసలు వ్యక్తులు ఎవరు? ఈ హత్యతో శ్రీమంతుడు-మీరా, విజయ్-సత్య దంపతులకు సంబంధం ఏంటి? చివరకు హంతకులను పోలీసులు ఎలా పట్టుకున్నారు? అన్నదే ఈ సినిమా కథ.

ఎలా ఉంది?
దర్శకుడు చైతన్య మోటూరి ఎంచుకున్న నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఈ సినిమాకి ప్రధాన బలం. సినిమా ఒక హత్యతో మొదలై ప్రేక్షకుల మెదళ్లపై పని చేస్తుంది. ప్రతి పాత్రను పరిచయం చేసిన విధానం, వాటి వెనుక రహస్యాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఇంటర్వెల్‌లో చిన్న ట్విస్ట్ సెకండాఫ్‌ని ఆసక్తికరంగా ఉంచుతుంది. ద్వితీయార్థంలో కథ వేగం పుంజుకుంటుంది. ముఖ్యంగా మహాభారతంలోని ‘కణిక నీతి’ కథను ప్రస్తుత కాలానికి ముడిపెట్టిన విధానం, ఈ సినిమా కథాంశం దర్శకుడి ప్రతిభకు నిదర్శనం. చివర్లో వచ్చే ట్విస్ట్ ఊహించని విధంగా ఉండి థ్రిల్లింగ్ ఫీలింగ్‌ని కలిగిస్తుంది.
నటీనటుల ప్రదర్శన
రఘు కుంచె గేదెల రాజుగా నటించారు. రౌడీ షీటర్ బాడీ లాంగ్వేజ్, ఆ కోపం, గోదావరి యాసను పలికించిన తీరు అద్భుతం. రిచ్‌గా వికాస్, విజయ్‌గా రామచంద్రం, సత్యగా టీనా శ్రావ్య, మౌనిక తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు. శివయ్య పాత్రలో రవి ఆనంద్ నటన ఆకట్టుకుంది.
సాంకేతిక నిపుణులు
రఘు కుంచె అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్ ని బాగా ఎలివేట్ చేసింది. పాటలు వినడానికి కూడా బాగున్నాయి. ఆసక్తికరమైన ట్విస్ట్‌లతో క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కించడంలో చైతన్య మోటూరి సక్సెస్ అయ్యాడు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్లు
ఈ సినిమాలో రఘు కుంచె నటన ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సినిమా నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో పాటు క్లైమాక్స్ ట్విస్ట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. రఘు కుంచె అందించిన నేపథ్య సంగీతం అతిపెద్ద ప్లస్ పాయింట్.
మైనస్ పాయింట్లు
ఈ సినిమాలో కథ అక్కడక్కడ నెమ్మదించినట్లు అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు రెగ్యులర్ థ్రిల్లర్ సినిమాలను తలపిస్తాయి
చివరి మాట
మర్డర్ మిస్టరీలు, సస్పెన్స్ థ్రిల్లర్‌లను ఇష్టపడే ప్రేక్షకులకు ‘గేదెల రాజు’ మంచి ఎంపిక. ఊహించని ట్విస్ట్‌లతో తెరకెక్కిన ఈ చిత్రం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను అలరిస్తుంది.
*రేటింగ్: 2.75/5
