ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-కొరివి జయకుమార్
చెల్లెలి కాపురం సజావుగా సాగేందుకు అన్నదమ్ములు ఎంతకైనా తెగించడం మామూలే. కానీ కొన్ని సందర్భాల్లో ఆ ప్రేమ ఆవేశంగా మారి అనూహ్య పరిణామాలకు దారి తీస్తుంది. అలాంటి హృదయ విదారక ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది. తన చెల్లెల్ని వేధిస్తున్నాడన్న కోపంతో సొంత బావమరిదినే హత్య చేసిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
లేపాక్షి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన రాజు చెల్లెలు మేఘనకు బెంగళూరు శివారు ఎలహంకకు చెందిన వినయ్‌కుమార్‌తో ఏడాది క్రితం వివాహమైంది. వినయ్ తన అన్నయ్యతో కలిసి ఓ చిన్న ప్రైవేట్ సంస్థను నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. మేఘన కూడా అదే కంపెనీలో పనిచేస్తుండడంతో మొదట్లో వైవాహిక జీవితం బాగానే సాగింది. అయితే కొద్దిసేపటికే వారి మధ్య విభేదాలు వచ్చాయి.

వినయ్ కుమార్ తన భార్యపై అనుమానం పెంచుకుని తరచూ వేధించడం మొదలుపెట్టాడు. చిన్న చిన్న విషయాలకే గొడవ పడడం, ఆమె ప్రవర్తనపై అనుమానాలు పెంచుకోవడం, అన్నయ్య రాజుకి ఫోన్ చేసి అవమానించడం కూడా దినచర్యగా మారింది. ఈ పరిణామాలు రాజుకు కోపం తెప్పించాయి. చెల్లెలి బాధను భరించలేక చివరకు ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు.
ఆ కోపంలో రాజు ఒక పథకం వేసి వినయ్‌ని స్వగ్రామానికి పిలిపించాడు. గ్రామ సమీపంలోని హంద్రీ నీవా కాలువ వద్దకు తీసుకెళ్లి దారుణంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని, బైక్‌ను ఎవరికీ తెలియకుండా కాలువలో పడేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
కొద్దిరోజుల తర్వాత కాలువలో మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అదే సమయంలో వినయ్ అదృశ్యమయ్యాడని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో కాలువలో దొరికిన మృతదేహం వినయ్‌దేనని నిర్ధారించారు.
విచారణలో భాగంగా కాల్ డేటాను పరిశీలించిన పోలీసులు.. వినయ్‌ని చివరిసారిగా రాజే సంప్రదించినట్లు గుర్తించారు. దీంతో రాజును అదుపులోకి తీసుకుని విచారించగా.. చెల్లెలు వేధింపుల కారణంగానే కోపంతో హత్య చేసినట్లు అంగీకరించాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.
కుటుంబ సమస్యలను కోపంతో కాకుండా ఓర్పుతో పరిష్కరించుకోవాల్సిన అవసరాన్ని ఈ సంఘటన గుర్తు చేస్తుంది. ఒకవైపు అనుమానం, మరోవైపు ఆవేశం కలిసి ఒక కుటుంబాన్ని పూర్తిగా నాశనం చేశాయి. చెల్లెలికి కాపురం కాపాడాలనే ఉద్దేశం ఉన్నప్పటికీ ఈ నిర్ణయం మరింత విషాదాన్ని మిగిల్చింది.
