మన సముద్రాన్ని కాపాడండి.. | బాపట్ల జిల్లా రామాపురం బీచ్‌లో మత్స్యకారులు చేపట్టిన ఆందోళన రాష్ట్రవ్యాప్తంగా వైరల్‌గా మారింది

ఆంధ్ర ప్రదేశ్

ఓయ్-కొరివి జయకుమార్

బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం బీచ్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టూరిజం డెవలప్ మెంట్ పేరుతో చేస్తున్న కార్యక్రమాలపై స్థానిక మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ జీవనాధారమైన సముద్రాన్ని కాపాడాలంటూ నిరసనకు దిగారు. ఈ మేరకు రిసార్టుల యజమానుల నుంచి, అధికారుల నుంచి మా సముద్రాన్ని కాపాడండి’’ అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఇదిలా ఉండగా గత నాలుగు రోజులుగా రామాపురం తీరంలో బోటింగ్ సౌకర్యాల ఏర్పాటు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఒంగోలుకు చెందిన ఓ వ్యక్తి డైవ్ చీరాల ఎల్ ఎల్ పి పేరుతో బోటింగ్ నడిపేందుకు అనుమతులు పొందినట్టు సమాచారం. స్థానిక ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారుల సహకారంతోనే ఈ పనులు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ నెల 19న బోటింగ్ ప్రారంభానికి ఏర్పాట్లు జరుగుతున్నాయనే ప్రచారం కూడా సాగుతోంది.

బాపట్ల జిల్లాలో రామాపురం బీచ్‌లో మత్స్యకారుల నిరసన, రాష్ట్రవ్యాప్తంగా వైరల్‌గా మారిన వార్తలు

అయితే కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌ (సీఆర్‌జెడ్‌) నిబంధనలకు విరుద్ధంగా ఈ పనులు జరుగుతున్నాయని మత్స్యకారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హై టైడ్ లైన్ కు 200 మీటర్ల లోపు ‘నో డెవలప్ మెంట్ జోన్ ’లో భారీ యంత్రాలతో ఇసుక మేటలను తొలగిస్తే పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని అంటున్నారు. ఈ ఇసుక తిన్నెలు సముద్ర అలల తీవ్రతను తగ్గించే సహజ రక్షణగా పనిచేస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

స్థానిక మత్స్యకారుల అభిప్రాయం ప్రకారం, ఈ ప్రాజెక్ట్ వారి ఫిషింగ్ లేన్లు మరియు పడవ నిల్వ ప్రాంతాలను దెబ్బతీస్తుంది. జీవనోపాధి పోతుందని ఆందోళన చెందుతున్నారు. టూరిజం డెవలప్‌మెంట్ పేరుతో మమ్మల్ని మా ప్రాంతాల నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని.. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఈ వివాదం నేపథ్యంలో మత్స్యకారుల సంఘాల నేతలు కూడా వారికి మద్దతు పలికారు.

మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికి నిర్వాహకులు భారీ యంత్రాలను వదిలి వెళ్లిపోయారని స్థానికులు చెబుతున్నారు. దాంతో ఈ ప్రాజెక్టుకు సంబంధించి పర్యావరణ అనుమతులపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సరైన క్లియరెన్స్ లేకుండానే పనులు నత్తనడకన సాగుతున్నాయని ఆరోపణలున్నాయి. జిల్లా కలెక్టర్ నుంచి అనుమతి ఉందని అధికారులు చెబుతున్నా పూర్తి వివరాలు వెల్లడించకపోవడం వివాదానికి దారి తీస్తోంది.

More posts