అంతర్జాతీయ
-బొమ్మ శివకుమార్
ఇరాన్‌తో చర్చలు విఫలమైన నేపథ్యంలో.. హార్ముజ్ జలసంధిని అడ్డుకుంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన హెచ్చరికపై ఇరాన్ తాజాగా ఘాటుగా స్పందించింది. ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హార్ముజ్ జలసంధిపై తమకు పూర్తి నియంత్రణ ఉందని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ఆదివారం ప్రకటించారు. శత్రువు ఏ తప్పు చేసినా తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించింది.
ఈ జలసంధిని అడ్డుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా నౌకాదళానికి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇరాన్ ఈ సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు ఇరాన్ బలగాలు అన్ని సముద్ర కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నాయి. “ఈ మార్గంలో ట్రాఫిక్ అంతా సాయుధ దళాల పూర్తి నియంత్రణలో ఉంది” అని గార్డ్స్ నావల్ కమాండ్ X పర్షియన్-భాష పోస్ట్‌లో తెలిపింది. అంతేకాదు, ‘‘శత్రువు తప్పుడు అడుగు వేస్తే.. జలసంధిలోని ఘోరమైన సుడిగుండంలో చిక్కుకుపోతాడు’’ అని కూడా హెచ్చరించింది.
ఈ బలమైన హెచ్చరికలతో పాటు, ఇరాన్ క్రాస్‌షైర్‌లలో ఓడలను చూపుతున్న వీడియోను కూడా పోస్ట్ చేసింది. తాజా పరిణామాలు ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచాయి. అంతకుముందు ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా జరిపిన చర్చలు విఫలమైన సందర్భంగా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. హార్ముజ్ జలసంధిని అడ్డుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. జలమార్గంలోకి ప్రవేశించడానికి లేదా నిష్క్రమించడానికి ప్రయత్నిస్తున్న అన్ని నౌకలపై అమెరికా నావికాదళం వెంటనే దిగ్బంధనాన్ని ప్రారంభిస్తుందని ట్రంప్ హెచ్చరించారు. అయితే తాజాగా ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ ఘాటుగా స్పందించింది.

పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఇరాన్, అమెరికా మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. అమెరికా, ఇరాన్ జట్లు అక్కడి నుంచి వెళ్లిపోయాయి. చర్చలు విఫలమయ్యాయని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వెల్లడించారు. దాదాపు 21 గంటలకు పైగా ఇస్లామాబాద్‌లో జరిగిన చర్చలు విఫలమయ్యాయని పేర్కొన్నారు. అయితే అమెరికా చేసిన డిమాండ్ల వల్లే చర్చలు విఫలమయ్యాయని ఇరాన్ చెబుతోంది.
