ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-సయ్యద్ అహ్మద్
శ్రీకాకుళం వాసులకు రైల్వే మరో శుభవార్త అందించింది. ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి తిరుపతికి వెళ్లాలంటే రెండు రైళ్లు మారి వెంకన్న దర్శనం చేసుకోవాల్సిన ఉద్దానం వాసులు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు చొరవతో ఆ భాగ్యం పొందబోతున్నారు. ఈ నెల 13న శ్రీకాకుళం రోడ్ నుంచి తిరుపతికి రెగ్యులర్, డైరెక్ట్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును రైల్వే శాఖ ప్రారంభించబోతోంది.
శ్రీకాకుళం రోడ్ నుండి తిరుపతికి హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ పేరుతో వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ప్రతి ఆదివారం తిరుపతి నుంచి బయలుదేరి సోమవారం శ్రీకాకుళం చేరుకుంటుంది. అలాగే ఇదే రైలు ప్రతి సోమవారం శ్రీకాకుళం నుంచి బయలుదేరి మంగళవారం తిరుపతికి తిరిగి వస్తుంది. దీంతో శ్రీకాకుళం ప్రయాణికులు ఇకపై విశాఖ వెళ్లి తిరుపతి రైలు ఎక్కాల్సిన అవసరం లేదు.

శ్రీకాకుళం ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. 75 ఏళ్ల తర్వాత జిల్లా చరిత్రలో తొలిసారిగా శ్రీకాకుళం నుంచి తిరుపతికి సాధారణ రైలు సర్వీసులు ప్రారంభమవుతున్నాయి. 17439/40 హంసఫర్ ఎక్స్‌ప్రెస్ ప్రతి ఆదివారం తిరుపతి నుండి మరియు ప్రతి సోమవారం శ్రీకాకుళం నుండి భక్తుల కోసం నడుస్తుంది… pic.twitter.com/0tlRJE2Gn3
— రామ్ మోహన్ నాయుడు కింజరాపు (@RamMNK) ఏప్రిల్ 8, 2026
ఈ కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్ కు శ్రీకారం చుట్టిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ విషయాన్ని ఎక్స్ లో ఆనందంగా పంచుకున్నారు.శ్రీకాకుళం వాసుల చిరకాల కోరిక నెరవేరిందని, 75 ఏళ్లలో జిల్లా చరిత్రలో తొలిసారిగా శ్రీకాకుళం నుంచి తిరుపతికి నేరుగా రైలు సర్వీసు ప్రారంభిస్తున్నామన్నారు. 17439/17440 హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు తిరుపతి నుండి ప్రతి ఆదివారం మరియు శ్రీకాకుళం నుండి ప్రతి సోమవారం నడుస్తాయి, ఇది భక్తులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ఈ రైలు ఏప్రిల్ 13న శ్రీకాకుళం రోడ్ స్టేషన్ నుండి ప్రారంభమవుతుంది. ఈ రైలు సర్వీసును మంజూరు చేసినందుకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ధన్యవాదాలు తెలిపారు.
