ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-కొరివి జయకుమార్
తెలుగుదేశం పార్టీ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంగా గుర్తింపు పొందిన “మహానాడు” ఈసారి పూర్తిగా సరికొత్త రూపంలో జరగనుంది. పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ప్రతి ఏటా నిర్వహించే ఈ మహాసభ టీడీపీకి రాజకీయ సభ మాత్రమే కాదు. అయితే ఇంధన పొదుపు, సాంకేతికత వినియోగం, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలతో ఈసారి మహానాడు 2026ను పూర్తిగా హైబ్రిడ్ ఆన్లైన్లో.. సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు.
వాస్తవానికి ఈ నెల 27, 28, 29 తేదీల్లో నెల్లూరులో మహానాడును భారీ ఎత్తున నిర్వహించేందుకు పార్టీ కూడా ఏర్పాట్లు ప్రారంభించింది. రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది కార్యకర్తలు, నాయకులు హాజరయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, ఇంధన వినియోగంపై ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన సేవింగ్ కాల్‌ను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ప్రభుత్వ వ్యయ నియంత్రణ, విద్యుత్ ఆదా, ఇంధన పొదుపు తదితర అంశాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న ఏపీ ప్రభుత్వం.. ఇప్పుడు పార్టీ కార్యక్రమాల ద్వారా ప్రజలకు కూడా అదే సందేశాన్ని అందించాలనుకుంటోంది.

మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ సెంటర్లో ఈ ఏడాది డిజిటల్ విధానంలో మహానాడు నిర్వహించనున్నారు. ఎన్టీఆర్ భవన్లో ప్రత్యేక వేదిక ఏర్పాటు చేసి అక్కడి నుంచి చంద్రబాబు, పొలిట్‌బ్యూరో సభ్యులు, ముఖ్య నేతలు ప్రసంగించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,845 క్లస్టర్లలో భారీ ఎలక్ట్రానిక్ స్క్రీన్లను ఏర్పాటు చేసి కార్యకర్తలు ప్రత్యక్ష ప్రసారం వీక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. టెక్నాలజీ ద్వారా పార్టీ నాయకత్వాన్ని గ్రామస్థాయి వరకు అనుసంధానం చేయడమే ఈ హైబ్రీడ్ మహానాడు ప్రధాన ఉద్దేశమని చెబుతున్నారు.
1982లో ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో పార్టీని స్థాపించిన తర్వాత కార్యకర్తలతో నేరుగా మమేకమయ్యే మహానాడు సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి ప్రతి మహానాడులోనూ పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, రాజకీయ తీర్మానాలు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ విధానాలపై చర్చలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ హయాంలో భావోద్వేగాలకు ప్రతీకగా నిలిచిన మహానాడు.. చంద్రబాబు నాయకత్వంలో సాంకేతికత, పరిపాలనా సంస్కరణలు, డేటా ఆధారిత రాజకీయ వ్యూహాలకు కేంద్ర బిందువుగా మారింది.
ఈసారి మహానాడులో రాష్ట్రాభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, యువత ఉపాధి, మహిళా సాధికారత, రైతు సంక్షేమం, డిజిటల్ గవర్నెన్స్, గ్రీన్ ఎనర్జీ వంటి అంశాలపై ప్రత్యేక తీర్మానాలు చేసే అవకాశం ఉంది. అలాగే 2029 ఎన్నికలకు సంబంధించి పార్టీ వ్యూహాలపై కూడా కీలక చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడం, సోషల్ మీడియా విభాగాన్ని విస్తరించడం, యువ నాయకత్వానికి ప్రాధాన్యం ఇవ్వడం వంటి అంశాలపై ప్రత్యేక కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇక మహానాడులో పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన సీనియర్ కార్యకర్తలకు సన్మానాలు, యువనేతలకు కొత్త బాధ్యతలు, సభ్యత్వ నమోదు కార్యక్రమాలపై ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ పనితీరుపై సమీక్షతోపాటు ప్రతిపక్ష పార్టీల రాజకీయ వ్యూహాలపై చంద్రబాబు దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. భారీ సమావేశాలతో సంప్రదాయ మహానాడుకు బదులు, పూర్తిగా డిజిటల్ ఫార్మాట్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం భారత రాజకీయాల్లో కొత్త ఒరవడికి నాంది కావచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
