క్రీడలు
ఓయ్-జక్కీ మహేష్
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఊహించని వివాదం చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ గెలిచినప్పటికీ డగౌట్‌లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు మేనేజర్ రోమీ భిందర్ నిబంధనలకు విరుద్ధంగా మొబైల్ ఫోన్ వాడుతూ కెమెరాకు చిక్కడంతో బీసీసీఐ వర్గాల్లో కలకలం రేగింది.
డగ్‌అవుట్‌లో మొబైల్ వినియోగం. నిబంధనల ఉల్లంఘన!
గౌహతిలోని బర్సపరా స్టేడియంలో మ్యాచ్ జరుగుతుండగా, యువ బ్యాట్స్‌మెన్ వైభవ్ సూర్యవంశీ పక్కన కూర్చుని మేనేజర్ రోమీ భిందర్ తన ఫోన్‌ను ఉపయోగించడం కనిపించింది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. మ్యాచ్ సమయంలో ‘ప్లేయర్స్ అండ్ మ్యాచ్ ఆఫీసర్స్ ఏరియా’లో ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం పూర్తిగా నిషేధం. టీమ్ మేనేజర్ ఫోన్ వినియోగానికి కొంత మినహాయింపు ఉన్నప్పటికీ.. అది కేవలం డ్రెస్సింగ్ రూంకే పరిమితమైంది. డగ్‌అవుట్‌లో కూర్చుని ఫోన్ ఉపయోగించడం నిబంధనలను ఉల్లంఘించడమేనని విశ్లేషకులు అంటున్నారు.

అవినీతి నిరోధక విభాగం నిఘా.. చర్యలు తప్పా?
లైవ్ మ్యాచ్‌లో బయటి వ్యక్తులతో సంభాషించకుండా ఉండేందుకు బీసీసీఐ ఈ కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. రోమి భిందర్ చేసిన ఈ చర్యను మ్యాచ్ రిఫరీ లేదా అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) విచారించే అవకాశం ఉంది. ఇది నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే, రాజస్థాన్ రాయల్స్ జట్టుకు భారీ జరిమానా లేదా హెచ్చరిక జారీ చేయబడుతుంది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో క్రికెట్ అభిమానులు బీసీసీఐని వివరణ కోరుతున్నారు.
🚨 మాజీ ఫిక్సర్ టీమ్ RR మళ్లీ సమస్యలో 🚨
🚨 రూల్ ఉల్లంఘనపై RRని శిక్షించేందుకు BCCI సెట్ చేయబడింది 🚨
మ్యాచ్‌లో నిబంధనలు ఉల్లంఘించిన రాజస్థాన్ రాయల్స్‌పై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. IPL నిబంధనల ప్రకారం, డగౌట్‌లో మొబైల్ ఫోన్లు ఖచ్చితంగా నిషేధించబడ్డాయి, కానీ సభ్యులు… pic.twitter.com/s9xYhOtcNC
— మఫ్ఫట్బాల్ విక్రాంత్ (@Vikrant_1589) ఏప్రిల్ 11, 2026
మ్యాచ్ పరిస్థితి ఇలా..
ఈ వివాదాన్ని పక్కన పెడితే.. రాజస్థాన్ రాయల్స్ మైదానంలో అద్భుత ప్రదర్శన చేసింది. ఆర్సీబీ నిర్దేశించిన 202 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ కేవలం 18 ఓవర్లలోనే ఛేదించింది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కేవలం 26 బంతుల్లో 78 పరుగులు చేయగా, ధ్రువ్ జురెల్ 81 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఓ వైపు వరుస విజయాలతో దూసుకెళ్తున్న రాజస్థాన్.. మరోవైపు మేనేజర్ చేసిన ఈ చిన్న పొరపాటు జట్టు పరువుకు ఇబ్బందిగా మారింది. మరి ఈ విషయంలో బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
