అంతర్జాతీయ
ఓయ్-బొమ్మ శివకుమార్
ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన గడువు మరికొద్ది గంటల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇరాన్ ఎనర్జీ హబ్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేశాయి. ఇరాన్లో చమురు సరఫరా కోసం చురుగ్గా ఉన్న ఖార్గ్ ద్వీపం లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. గడువుకు ముందే అమెరికా-ఇజ్రాయెల్ బలగాలు జరిపిన దాడుల నేపథ్యంలో ఇరాన్ అప్రమత్తమైంది. మరోవైపు ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇరాన్‌కు ఇచ్చిన గడువు మరో రెండు గంటల్లో ముగియనున్న నేపథ్యంలో.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ చరిత్రలో ఈ రాత్రి కీలకమని అన్నారు. అసలు రాత్రికి రాత్రే ఇరాన్‌ను తుడిచిపెట్టేయడం తనకు ఇష్టం లేదని సంచలన వ్యాఖ్యలు చేశాడు. దేవుడు ఇరాన్ ప్రజలను ఆశీర్వదిస్తాడు. అలాగే ఇరాన్లో 47 ఏళ్ల అవినీతి, అరాచక పాలనకు తెరపడుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. కానీ ఇరాన్లో కొత్త నాయకత్వం ఉందని.. ఈ నాయకత్వం అద్భుతాలు చేయగలదని ట్రంప్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
అంతకుముందు ఏప్రిల్ 6న ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అమెరికా అధ్యక్షుడు ఇరాన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.. హార్ముజ్ జలసంధిపై తాను ఇచ్చిన గడువుకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. ఇరాన్‌కు మంగళవారం రాత్రి 8 గంటల వరకు గడువు ఉందని.. అందులో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. ఒక్క రాత్రిలో ఇరాన్ మొత్తం తుడిచిపెట్టుకుపోతుందని సంచలన వార్నింగ్ ఇచ్చాడు. ఏప్రిల్ 7 మంగళవారం రాత్రి కావొచ్చు అంటూ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.. దాంతో ట్రంప్ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మరోవైపు, ఇరాన్ ప్రజలు రైలు ప్రయాణం మానుకోవాలని ఇజ్రాయెల్ సైన్యం ఇప్పటికే ఎక్స్ ప్లాట్‌ఫారమ్‌పై అధికారిక ప్రకటన చేసింది. ఈ మేరకు ఇరాన్ ప్రజలు రైళ్లను ఉపయోగించవద్దని, రైల్వే లైన్ల దగ్గరకు కూడా వెళ్లవద్దని ఇజ్రాయెల్ హెచ్చరించింది. దాంతో అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ పై భీకర దాడులకు తెగబడుతున్నట్లు స్పష్టమవుతోంది.
