అంతర్జాతీయ
ఓయ్-బొమ్మ శివకుమార్
చైనాలో నిబంధనలు ఎలా ఉంటాయో మనకు తెలుసు. అక్కడ అసలు స్వేచ్ఛ లేదు. అలాగే ప్రజలు, ప్రజాప్రతినిధులు చాలా క్రమశిక్షణతో ఉంటారు. పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి ఇలాంటి క్రమశిక్షణ అలవర్చుకుంటారు. చైనాలో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తే, అవినీతికి పాల్పడితే కఠినంగా శిక్షిస్తారు. తాజాగా చైనాలో ఓ సంచలనం చోటు చేసుకుంది. సైనిక న్యాయస్థానం ఇద్దరు మాజీ రక్షణ మంత్రులకు మరణశిక్ష విధించింది.
చైనాకు చెందిన ఇద్దరు మాజీ రక్షణ మంత్రులు వీ ఫెంగ్ లీ, లీ షాంగ్ ఫూ భారీ అవినీతికి పాల్పడ్డారు. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ చేపట్టిన ప్రక్షాళనలో భాగంగా ఈ ఇద్దరు మాజీ రక్షణ మంత్రులకు మరణశిక్ష విధిస్తూ చైనా సైనిక న్యాయస్థానం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఇద్దరు నేతలు తమ సర్వీసులో విపరీతంగా లంచాలు తీసుకున్నారని, అధికార దుర్వినియోగానికి కూడా పాల్పడ్డారని తేలింది. ఈ నేపథ్యంలోనే మిలటరీ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది.

అయితే, చైనా చట్టాల ప్రకారం, ఈ ఇద్దరు మాజీ మంత్రులకు రెండేళ్లపాటు ఉరిశిక్ష విధించబడింది. చైనీస్ చట్టం ప్రకారం, రెండేళ్లు మంచి ప్రవర్తన కలిగి ఉంటే శిక్షను జీవిత ఖైదుగా మార్చవచ్చు. చైనా క్షిపణి కార్యక్రమంలో భాగంగా జరిగిన భారీ అవినీతి కుంభకోణంలో వీరిద్దరూ 2024లో కమ్యూనిస్టు పార్టీ నుంచి బహిష్కరించబడ్డారు. వీ ఫెంగ్ లీ, లీ షాంగ్‌ఫులు తమ స్థానాలకు అడ్డు లేకుండా భారీ మొత్తంలో ప్రభుత్వ సొమ్మును మళ్లించారని విచారణలో వెల్లడైంది. మరోవైపు చైనా మిలిటరీలో చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగమే ఈ శిక్షలు అన్నది స్పష్టం. ఇప్పుడు ఈ వార్త చైనా వ్యాప్తంగా సంచలనంగా మారింది.
