ఆంధ్ర ప్రదేశ్
ఓయి-లింగారెడ్డి గజ్జల
బీహార్ నుంచి తమిళనాడు వరకు, ఢిల్లీ నుంచి కేరళ వరకు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక్కటే గుసగుసలాడుతోంది ‘డీలిమిటేషన్’ (నియోజకవర్గాల పునర్విభజన). కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న ఈ బిల్లు దేశ రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేయనుంది. అయితే ఈ అంశంపై దక్షిణాది రాష్ట్రాలు ఒకవైపు, ఉత్తరాది రాష్ట్రాలు మరోవైపు నిలిచాయి. జనాభా నియంత్రణను అనుసరించి అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు పెంపు రాజకీయ పలుకుబడి తగ్గుతుందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.
తమిళనాడులో స్టాలిన్, తెలంగాణలో రేవంత్ రెడ్డి, కేటీఆర్, కేరళలో పినరయి విజయన్ వంటి నేతలు దక్షిణాది ప్రయోజనాల కోసం ఉద్యమిస్తుంటే, ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ) ఇప్పుడు కేంద్రానికి బేషరతు మద్దతు ఇస్తూ దేశ వ్యాప్తంగా రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీని వెనుక జగన్ మోహన్ రెడ్డి వ్యూహం ఏంటి? దక్షిణాది రాష్ట్రాల ఉమ్మడి వాణిని ఎందుకు పట్టించుకోలేదు?

దక్షిణాది రాష్ట్రాల ఆందోళన ఏమిటి?
జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ ప్రక్రియ జరిగితే జనాభా నియంత్రణ పాటించని యూపీ, బీహార్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో లోక్ సభ స్థానాలు భారీగా పెరగనున్నాయి. అదే సమయంలో జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాల రాజకీయ పలుకుబడి కేంద్రంలో తగ్గుతుంది. ‘దక్షిణాది అస్తిత్వానికి అన్యాయం’ అంటూ తమిళనాడు సీఎం స్టాలిన్ నల్లజెండాలతో నిరసనలకు పిలుపునిచ్చారు. జనాభా ప్రాతిపదికన కాకుండా అభివృద్ధి ప్రాతిపదికన సీట్లు కేటాయించాలని రేవంత్ రెడ్డి, కేటీఆర్ కూడా డిమాండ్ చేస్తున్నారు.
వైసీపీ మద్దతు వెనుక ‘సజ్జల’ సమర్థన..
ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన ప్రకటన ఆసక్తికరంగా మారింది. సీట్ల పెంపుదల వల్ల కొత్తవారికి, యువతకు అవకాశాలు వస్తాయని, చిన్న నియోజకవర్గాల వల్ల పాలన సులువవుతుందని, అభివృద్ధి వేగవంతమవుతుందని పేర్కొన్నారు. అంటే ప్రాంతీయ ప్రయోజనాల కంటే పార్టీ సంస్థాగత బలోపేతం, రాజకీయ అవకాశాల పెంపుదలకు వైసీపీ ప్రాధాన్యమిస్తోందని తెలుస్తోంది.
జగన్ వ్యూహంలో దాగి ఉన్న కీలక అంశాలు:
1. కేంద్రంతో సత్సంబంధాలు – రాజకీయ రక్షణ:
ఆంధ్రప్రదేశ్‌లో అధికారం కోల్పోయిన జగన్ మోహన్ రెడ్డికి కేంద్రంలోని బీజేపీ నేతల మద్దతు కీలకం. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం (టీడీపీ-జనసేన-బీజేపీ) అధికారంలో ఉన్న నేపధ్యంలో కేంద్రంతో ఢీకొనడం కంటే స్నేహపూర్వకంగా ఉండటమే మేలని జగన్ భావిస్తున్నారు. డీలిమిటేషన్ వంటి కీలక బిల్లుకు మద్దతివ్వడం ద్వారా ప్రధాని మోదీ, అమిత్ షాలతో మరోసారి తన విశ్వసనీయతను నిరూపించుకోవాలని చూస్తున్నారు.
2. చంద్రబాబును కష్టాల్లో పడేస్తున్న ఆయుధాన్ని వదులుకున్నారా?
నిజానికి డీలిమిటేషన్ అంశం చంద్రబాబును కార్నర్ చేసేందుకు జగన్ కు చక్కటి అవకాశం. దక్షిణాదికి కేంద్రం అన్యాయం చేస్తుంటే ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న బాబు నిలబడే పరిస్థితి లేదు. దక్షిణాది ఆత్మగౌరవం పేరుతో జగన్ ప్రచారం చేసి ఉంటే చంద్రబాబుకు ఇబ్బందిగా ఉండేది. కానీ జగన్ ఆ మార్గాన్ని ఎంచుకోలేదు. కేంద్రంతో దోస్తీ కంటే బాబుపై పోరు తక్కువ అని జగన్ భావించడమే ఇందుకు కారణం కావచ్చు.
3. కొత్త నాయకత్వం – సామాజిక సమీకరణాలు:
వైసీపీ ప్రాథమికంగా క్యాడర్ బేస్డ్ పార్టీ. నియోజకవర్గాల సంఖ్య పెరిగితే గత ఎన్నికల్లో ఓడిపోయిన సీనియర్లకు, కొత్త యువ నేతలకు సీట్ల సర్దుబాటు సులువు అవుతుంది. అలాగే సామాజిక సమీకరణాలను మార్చి బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు పునర్విభజన దోహదపడుతుందని జగన్ బలంగా విశ్వసిస్తున్నారు.
ప్రాంతీయ పార్టీల భవిష్యత్తుపై ప్రభావం:
రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, డీలిమిటేషన్ అనేది ప్రాంతీయ పార్టీల పట్టును దెబ్బతీసే ప్రక్రియ. లోక్ సభ స్థానాలు విపరీతంగా పెరిగితే జాతీయ పార్టీల ప్రాబల్యం పెరుగుతుంది. అందుకే స్టాలిన్ లాంటి నేతలు వ్యతిరేకిస్తున్నారు. కానీ జగన్ మాత్రం చిన్న నియోజకవర్గాలు – మంచి అభివృద్ధి అనే నినాదంతో ముందుకు సాగుతున్నారు.
దక్షిణాది రాష్ట్రాలన్నీ డీలిమిటేషన్ ను రాజకీయ ఉచ్చుగా చూస్తుంటే.. జగన్ మాత్రం దాన్ని అవకాశంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీకి నైతిక బలం చేకూర్చడం ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో తన ఉనికిని కాపాడుకోవడంతో పాటు సీట్ల పెంపుతో తన పార్టీ క్యాడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు. ఈ “బేషరతు మద్దతు” కేంద్రంలో జగన్ కు ఎలాంటి లాభాలు తెస్తుందో, ఏపీ ప్రజల్లో ఎలాంటి ముద్ర వేస్తుందో కాలమే చెప్పాలి.
