తెలంగాణ
ఓయ్-సాయి చైతన్య
తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు బిగ్ అప్‌డేట్. ఇంటర్ ఫలితాల విడుదల సమయం ఖరారు. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక ప్రకటన చేసింది. అదే సమయంలో విద్యార్థులు ఈసారి ఫలితాలు సులభంగా తెలుసుకునేలా కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. వాట్సాప్ నంబర్‌కు సందేశం పంపడం ద్వారా ఫలితాలను వెంటనే తెలుసుకునే అవకాశం కల్పించారు. ఈసారి ఫలితాలను సీఎం రేవంత్ విడుదల చేయనున్నారు.
విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాల విడుదలకు ఎట్టకేలకు సమయం వచ్చింది. ఈ నెల 12న మధ్యాహ్నం 12.30 గంటలకు జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను విడుదల చేయనున్నారు. కాగా, రాష్ట్రంలో ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 9.9 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు 4,89,126 మంది, ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 5,07,949 మంది ఉన్నారు. అయితే గతంలో జరిగిన పొరపాట్లను దృష్టిలో ఉంచుకుని ఇంటర్ బోర్డు ఈసారి ఫలితాలను విడుదల చేయడంలో తగు జాగ్రత్తలు తీసుకుంది.

వాట్సాప్ నంబర్ ద్వారా ఫలితాల వెల్లడి
మార్కుల గణనలో ఎలాంటి తేడా లేకుండా పరీక్షను రెండుసార్లు మూల్యాంకనం చేశారు. అయితే ఒక పేపర్‌లో కేవలం ఒకటి లేదా రెండు మార్కులతో ఫెయిల్ అయిన విద్యార్థుల విషయంలో ప్రత్యేక శ్రద్ధతో రీ వాల్యుయేషన్ చేశారు. ఈసారి వాట్సాప్ ద్వారా ఫలితాలు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. గతంలో ఇదే పద్ధతిలో హాల్‌టికెట్ల పంపిణీ విజయవంతంగా నిర్వహించగా, ఇప్పుడు వాట్సాప్ ద్వారా కూడా అదే పద్ధతిలో ఫలితాలను అందజేస్తున్నారు. విద్యార్థులు తమ స్మార్ట్‌ఫోన్‌లో 8096958096 నంబర్‌ను సేవ్ చేసి, ‘హాయ్’ అని సందేశం పంపాలి. ఆ తర్వాత మెనులో “BIE పరీక్షా ఫలితం” ఎంపికను ఎంచుకుని, హాల్ టికెట్ నంబర్, సంవత్సరం (1వ సంవత్సరం/2వ సంవత్సరం), స్ట్రీమ్ (జనరల్/ఒకేషనల్) వివరాలను నమోదు చేయండి. వివరాలు సమర్పించిన వెంటనే, ఫలితాలు సందేశం రూపంలో కనిపిస్తాయి.
