ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-సాయి చైతన్య
గోదావరి పుష్కరాల ముహూర్తం ఖరారైంది. అనేక చర్చల అనంతరం పండితుల సూచనల మేరకు ముహూర్తం ఖరారు చేశారు. కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. కేంద్రం ఇప్పటికే నిధులు మంజూరు చేసింది. రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. పనుల నిర్వహణ కోసం ఏపీ ప్రభుత్వం ఓ కమిటీని ప్రకటించింది. ఈలోగా పుష్కరాలకు ముహూర్తం ఖరారైంది. ఈసారి గోదావరి పుష్కరాలకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.
గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈ పుష్కరాలను 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు 8 కోట్ల మంది భక్తులు వస్తారని, ప్రత్యేక రోజుల్లో గరిష్టంగా 75,000 మంది వస్తారని అంచనా వేస్తున్నారు. కాగా, గోదావరి పుష్కరాలకు పలు ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. ఆలయాలన్నీ పునర్నిర్మించబడుతున్నాయి. గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ఇప్పటికే మూడుసార్లు సమీక్షా సమావేశాలు నిర్వహించామన్నారు. పుష్కరాలకు సంబంధించి రాజమహేంద్రవరంలో రూ.9.55 కోట్ల పనులకు శంకుస్థాపనలు చేసినట్లు వివరించారు. గోదావరి పుష్కరాల నాటికి రాజమండ్రితో పాటు గోదావరి పరివాహక ప్రాంతంలోని అన్ని ఆలయాలను అభివృద్ధి చేస్తామన్నారు.

కుంభమేళా వంటి ప్రభుత్వ ఏర్పాట్లు
కాగా, 43 ఆలయాల పునర్నిర్మాణానికి ఇప్పటికే రూ.51 కోట్ల నిధులు మంజూరయ్యాయని మంత్రి ఆనం తెలిపారు. హాజరయ్యే భక్తుల అంచనా, వివిధ సౌకర్యాలపై చర్చలు జరిపారు. రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో గోదావరి ప్రవహిస్తున్నందున ఆయా ప్రాంతాల్లో పుష్కర పనులు వేగవంతం కానున్నాయి. దీనికి సంబంధించి ఇటీవల పలు శాఖలు సమీక్ష నిర్వహించాయి. పుష్కరాలకు వచ్చే భక్తుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ రద్దీ నియంత్రణకు ముందస్తుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ఘాట్లో ప్రతి 50 మీటర్లకు ఒక కంపార్ట్మెంట్ను ఏర్పాటు చేయాలని, అందులో 10 సామాజిక మరుగుదొడ్లు, రెండు దుస్తులు మార్చుకునే గదులు, 6 వాటర్ ఏటీఎంలను అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు.
