తెలంగాణ
ఓయ్-చంద్రశేఖర్ రావు
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావును హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను గృహనిర్బంధంలో ఉంచారు. పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసనగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసం ఎదుట నిరసనకు బీజేపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వలేదని తెలంగాణ బీజేపీ ఆరోపిస్తోంది. ఆయనతో పాటు మరికొందరు బీజేపీ నేతలను గృహనిర్బంధంలో ఉంచారు.
131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నేతలు ఇవాళ ఆందోళనలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి నివాసాన్ని తాకాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఈ ఉదయం హైదరాబాద్ పోలీసులు రాంచందర్ రావు నివాసానికి చేరుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకున్నారు. గృహ నిర్బంధంలో ఉంచారు. ఈ విషయం తెలియగానే పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆయన నివాసానికి చేరుకున్నారు.

రాంచందర్‌రావును గృహనిర్బంధంలో ఉంచడాన్ని తప్పుబట్టారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలపాలనుకున్నామని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తమను అణిచివేస్తోందని ఆరోపించారు. తెలంగాణలో పోలీసు రాజ్యం నడుస్తోంది. గృహ నిర్బంధాలు తమ గొంతులను ఆపలేవని తేల్చిచెప్పారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో బీజేపీ యువమోర్చా నేతలు నిరసనకు దిగారు.
#చూడండి | హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం ఎదుట ఆందోళనకు బిజెపి పిలుపునివ్వడంతో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు రాంచందర్‌రావును పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు.
(మూలం: తెలంగాణ బీజేపీ) pic.twitter.com/wJlKL183FR
– ANI (@ANI) ఏప్రిల్ 18, 2026
ఈ సందర్భంగా లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో కాంగ్రెస్ వైఖరిని విమర్శించారు. ఈ పరిణామాల మధ్య బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. లింగ సమానత్వం దిశగా సాగిన చారిత్రాత్మక అడుగును అడ్డుకున్నారని ఆరోపిస్తూ అన్ని జిల్లాలు, నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ కార్యాలయాల ఎదుట నిరసనలు జరుగుతున్నాయి.
కాంగ్రెస్ మహిళా వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని, తద్వారా బిల్లును అడ్డుకుంటున్నదని ఆరోపిస్తూ ప్రజల మద్దతును కూడగట్టుకోవడం, శాసన సభల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వ నిబద్ధతను తెలియజేయడం బీజేపీ నిరసనల ప్రధాన ఉద్దేశం. ఇందులో భాగంగానే భారీ ర్యాలీలు నిర్వహించడం, బీజేపీయేతర ముఖ్యమంత్రుల నివాసాల ముందు బైఠాయించడం వంటి ఆందోళనలకు బీజేపీ శ్రీకారం చుట్టింది.
