అంతర్జాతీయ
ఓయ్-బొమ్మ శివకుమార్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన గడువు మరికొద్ది గంటల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలో ఒక్కసారిగా యుద్ధ వాతావరణం వేడెక్కింది. ఇరాన్‌ను ఒక్క రాత్రిలో తుడిచిపెట్టేస్తామని ట్రంప్ ఇటీవల హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే ట్రంప్ మాటలను ఇరాన్ ఏమాత్రం లెక్క చేయడం లేదు. దాడులు కొనసాగుతున్నాయి.
ఇజ్రాయెల్-అమెరికా సంయుక్తంగా ఇరాన్ పై దాడి చేస్తుండగా… ఇరాన్ మాత్రం అదే రేంజ్ లో ఇజ్రాయెల్ పై దాడులను కొనసాగిస్తోంది. ఇటీవల, ఇరాన్ రాజధాని టెహ్రాన్ సమీపంలోని అల్బోర్జ్ ప్రావిన్స్‌ను లక్ష్యంగా చేసుకున్న వైమానిక దాడిలో 18 మంది మరణించినట్లు ఇరాన్ అధికారిక మీడియా తెలిపింది. కాగా, ఈ దాడిలో మరో 24 మంది గాయపడినట్లు సమాచారం. అయితే ట్రంప్ గడువు సమీపిస్తున్న తరుణంలో ఇరాన్ ప్రజలకు ఇజ్రాయెల్ కీలక ప్రకటన చేసింది.
ఇరాన్‌లో ఎవరూ రైళ్లను ఉపయోగించవద్దని, రైల్వే లైన్ల దగ్గరకు ఎవరూ వెళ్లవద్దని ఇజ్రాయెల్ సైన్యం కీలక ప్రకటన చేసింది. ఇరాన్‌లో ప్రజల భద్రత దృష్ట్యా, ప్రయాణానికి రైళ్లను ఉపయోగించవద్దని కోరింది. ఈ మేరకు రైలు ప్రయాణాలను వెంటనే నివారించాలని ఇరాన్ ప్రజలకు సూచించారు. ఈ మేరకు ఇజ్రాయెల్ పర్షియన్ భాషలో ఎక్స్ ప్లాట్ ఫామ్ ను పోస్ట్ చేసిందని ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్ స్పష్టం చేసింది.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన గడువు మరికొద్ది గంటల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి ఇరాన్‌కు కీలకంగా మారింది. ఇరాన్‌ను ఒక్క రాత్రిలో తుడిచిపెట్టేస్తామని ట్రంప్ తాజా మీడియా సమావేశంలో హెచ్చరించారు. ఆ రాత్రి మంగళవారం రాత్రి కావొచ్చని తీవ్రంగా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రజలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్ పై మరో భీకర దాడికి అమెరికా-ఇజ్రాయెల్ సైన్యం సిద్ధమవుతున్నట్లు సమాచారం.












